Spread the love

పదో తరగతిలోనే విద్యార్థులు సత్కారం పొందడం గొప్ప ప్రశంసని, వారి తల్లిదండ్రులకు గర్వకారణం అని నగర డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారని, ఇదే స్ఫూర్తిని మున్ముందూ కొనసాగించి ఇష్టమైన రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (అవోపా) ఆధ్వర్యంలో పది, ఇంటర్‌ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన జిల్లాలోని ఆర్యవైశ్య విద్యార్థులకు మంగళవారం స్థానిక చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె.. ముందుగా వాసవీమాత చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతిభ చూపుతున్న ఆర్యవైశ్య బిడ్డలను గుర్తించి, ప్రోత్సహించిన అవోపాకు అభినందనలు తెలిపారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోవద్దని సూచించారు. భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి నలుగురికి ఉపాధి కల్పించేలా, అందరికీ మంచి చేసేలా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్‌ వంటి పథకాల అమలుతోపాటు.. విద్యాకానుకల పేరిట స్కూల్‌ బుక్స్‌, స్టడీ మెటీరియల్స్‌, బ్యాగ్‌, షఉ అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహించడం చాలా గొప్ప విషయమన్నారు. నాడు-నేడు పేరిట పాఠశాలలకు సరికొత్త రూపురేఖలుతో అనేక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అవోపా గతంలో ఆరోగ్య శిబిరాలు, వధూవరుల పరిచయ వేదికలు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం.. అందరికీ ఆదర్శంగా నిలవడం చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో అతిథులుగా బండారు బంగార్రాజు,ఎం.వి.వి సత్యనారాయణ, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కుమ్మరిగుంట శ్రీనివాసరావు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జనరల్‌ సెక్రటరీ రవ్వా శ్రీనివాస్‌ మాట్లాడారు. అవోపా అధ్యక్షుడు బండారు చంద్రశేఖర్‌, కార్యదర్శి తవ్వా మోహనరావు, కోశాధికారి ముమ్మిడిశెట్టి సత్యనారాయణ పర్యవేక్షణలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
 


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *