prof nageshwarprof nageshwar
Spread the love

నాలుగేళ్ల వరకూ మాటలు సరిగా రాని అబ్బాయి…! ఇప్పుడు వ్యవస్థల్నే ప్రశ్నించే పాత్రికేయుడు. ఆంగ్లం రాదని బావిలో దూకడానికి సిద్ధపడ్డ విద్యార్థి..! నేడు ఎంతో మందిని తీర్చిదిద్దే ఆచార్యుడు. ప్రభుత్వాల లోపాల్ని ఎత్తిచూపే సామాన్యుడు..! శాసనమండలిలో ఓ ప్రజా నాయకుడు.  అర్థమైంది కదూ… ఆయన ఆచార్యులు కె.నాగేశ్వర్‌ అని!

ప్రజా సమస్యలే గొంతుకగా… పాలకుల నిర్లక్ష్యాన్ని నిర్మొహమాటంగా ఎండగట్టే ఆయన… ఒకప్పుడు తెలుగు మాధ్యమంలో ప్రభుత్వ బడిలో చదువుకున్న విద్యార్థే.  ప్రశ్న… మీదే సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్మే వ్యక్తి, ప్రభుత్వాలను ప్రశ్నలతో నిలదీసే శక్తి… అయిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఊర్లో విశేషాలు, కుటుంబ వివరాలు, సామాజిక చైతన్యంపై అభిప్రాయాలు వెలిబుచ్చారు.

నానమ్మ బాగా కొట్టింది

మాది ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మందమర్రి మండలంలో ఎదులాపురం గ్రామం. నాన్న సదాశివరావు. అమ్మ అనసూయ. నాకు ఒక అన్నయ్య, అక్కా, చెల్లి ఉన్నారు. ఎనిమిదేళ్ల వయస్సులో నేను ఊర్లో ఓ దళిత పిల్లాడితో కలిసి ఆడుకుంటున్నా. మా నాయనమ్మ చూసి నన్ను పిలిచి కొట్టింది. వాళ్లతో మనం తిరగకూడదు. వాళ్లను తాకకూడదని మందలించింది. దేవుడి దృష్టిలో అందరం సమానం అయినప్పుడు వాళ్లతో ఎందుకు కలిసి ఉండకూడదో చెప్పమని ఎదురు ప్రశ్నించాను. మళ్లీ రెండు తగిలించింది. ఆ కోపంతో నేను వెళ్లి వాళ్లింట్లో భోజనం చేసి వచ్చా. అప్పుడు ఇంకా బాగా కొట్టింది. నేను ఏ తప్పు చేయలేదు… నేను నా ప్రవర్తన మార్చుకోనని తెగేసి చెప్పా. అలా నిజాన్ని నిర్భయంగా చెప్పడం, ఎలాంటి పక్షపాతం చూపకపోవడం అనేవి నాకు చిన్నప్పటి నుంచే అలవడ్డాయి. నాలుగేళ్ల వరకూ మాటలు సరిగా రాలేదని ఇంట్లో వాళ్లంతా భయపడ్డారు. ఆ తర్వాత నా మాటలే ఆగలేదు.

నాకిక ఇంగ్లీషు రాదనుకున్నా

ఆరో తరగతి వరకూ నేను తెలుగు మాధ్యమంలో చదివాను. ఏడో తరగతిలో నాన్న సదాశివరావు నన్ను ఆంగ్ల మాధ్యమంలో చేర్పించారు. అది మిషనరీ స్కూల్‌. అక్కడ సీటు ఇవ్వడానికి నాకు చిన్న ఇంటర్వ్యూలాంటిది నిర్వహించారు. ‘వాట్‌ ఈజ్‌ యువర్‌ రెసిడెన్స్‌’ అని ప్రశ్నించారు. నేను సమాధానం చెప్పలేక పోయా. నాకు ప్రవేశం ఇవ్వలేమని చెప్పారు. మా అబ్బాయిని ఆరునెలల పరీక్షల దాకా చూడండి. మొదటి 20 మందిలో ఉండకపోతే… నేను తీసుకెళ్లి తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తానని నచ్చజెప్పారు. ప్రిన్సిపల్‌ ఒప్పుకొన్నారు. మొదటి, రెండో, మూడో యూనిట్లలో ఫెయిల్‌ అయ్యాను. నాకిక ఇంగ్లీషు రాదనుకున్నా. బావిలో దూకేద్దామని వెళ్లా. ఇంతలో అక్కడికి ఓ స్నేహితుడు వచ్చాడు. దాంతో ఆలోచన విరమించుకొని… ఇంగ్లీషు నాకు ఎందుకు రాదో చూడాలనుకున్నా. డిక్షనరీలు సైతం కంఠస్తం చేయడం ప్రారంభించా. గ్రామర్‌ పుస్తకాలు తెచ్చి నాన్న నాకు బాగా నేర్పించారు. మూడునెలల్లో ఆంగ్లంపై పట్టుసాధించా. ఆరు నెలల పరీక్షలు వచ్చాయి. ఫలితాలు చెప్పారు. నేనే క్లాస్‌ ఫస్ట్‌. 56 అక్షరాల తెలుగు వచ్చినప్పుడు… 26 అక్షరాల ఆంగ్లం నేర్చుకోవడం కష్టమేమి కాదు. నాకు ఏది వంటబట్టదో దాన్ని ఛాలెంజ్‌ చేసి గెలుస్తాను.

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పాసయ్యాను

బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ పూర్తిచేశా. జర్నలిజం చేశా. ఈ లోపు సివిల్స్‌ ప్రిలిమ్స్‌ రాశా. పాసయ్యాను. మెయిన్స్‌ కోసం చదువుతున్నప్పుడు… నేను చదివి తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపించింది.  గ్రహించాల్సిన విజ్ఞానం ఎంతో పెట్టుకొని… నేను కొన్నింటికే ఎందుకు పరిమితం కావాలి? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా. మెయిన్స్‌ రాయలేదు. అందరూ మెయిన్స్‌ రాయక పిచ్చి పనిచేశావన్నారు. పది సంవత్సరాల తర్వాత… నేను ఐఏఎస్‌ అధికారులకు తరగతులు చెప్పాను. అంతకన్నా ఇంకేం కావాలి.

రామాయణం… చెప్పేవాణ్ని

చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాణ్ని. నాన్న అప్పుడు అధ్యాపకుడిగా పనిచేస్తుండేవారు. నాలోని అల్లరి తగ్గించడానికి వేసవి సెలవుల్లో ఓ హోంవర్క్‌ ఇచ్చాడు. రామాయణం చదివి, అర్థం చేసుకొని, గ్రామస్థులకు దాన్ని చెప్పాలి. అలా పదో తరగతి లోపే నేను రామాయణం, మహాభారతం చదివేశాను. అర్థం చేసుకున్నాను. ఇతరులకు అర్థమయ్యేలా చెప్పాను. ఒక కొత్త విషయం తెలుసుకోవడం, తెలిసినదాన్ని ఇతరులకు పంచడం అనే ప్రక్రియ అప్పుడే అలవాటైంది. దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నా. జ్ఞానం సంపాదించి… పదిమందికి పంచడం కంటే అదృష్టం ఏదీ ఉండదనేది నా అభిప్రాయం.

ఎంసెట్‌లో 994వ ర్యాంకు

నన్ను హైదరాబాద్‌లో ఉంచి ఇంటర్‌ చదివించడానికి మా అమ్మా,నాన్నలు ఎంతో కష్టపడ్డారు. అన్ని ఖర్చులూ తగ్గించుకునే వారు. నూనె కూడా  3 లీటర్లకు బదులు రెండు లీటర్లతో సర్దుకోవాలని అమ్మకు చెప్పేవారు నాన్న. నాకు ఫిజిక్స్‌ ఎంత చదివినా అర్థమయ్యేది కాదు. కష్టపడ్డాను. ఇంటర్‌ ఫిజిక్స్‌లో స్టేట్‌ సెకండ్‌ మార్కులు వచ్చాయి. ఎంసెట్‌లో 994 ర్యాంకు వచ్చింది. అయినా ఇంజినీరింగ్‌లో సీటు రాలేదు.

ఆత్మవిశ్వాసం ముఖ్యం

యువత ఏదైనా సాధించాలంటే ముందు ఆత్మవిశ్వాసం కావాలి. 1977లో మా నాన్న ఇంటికి ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇల్లెస్ట్రేటెడ్‌ వీక్లీ తీసుకొచ్చారు. దానిలో నేనూ, అన్నయ్య బొమ్మలు చూస్తూ ఉన్నాం. ‘అన్నా… దీనిలో నేను వ్యాసం రాయాలి….’ అన్నాను. ‘ఒరేయ్‌ చదివితే మనకు ఇది అర్థమే కాదు… ఇందులో రాయడం ఏంట్రా ఊరుకో’ అన్నాడు. ‘ఇందులో వ్యాసాలు రాసింది కూడా మనుషులే కదా… వాళ్లు రాయగా లేంది? మనమెందుకు రాయలేం..’ అన్నా. 1986లో అదే ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశా. యువత తమలో ఉన్న ప్రతిభను గుర్తించి, ఏకాగ్రతతో ప్రయత్నిస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. యువతకు ఆసక్తులు చాలా ఉంటాయి… ఆశయాలు ఉండవు. ఆశయం ఉంటే.. ఏకాగ్రతతో కృషి చేస్తారు. అనుకున్నది సాధిస్తారు. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం ఓ కొత్త ప్రతిపాదన తెచ్చింది. అదే డిజైన్‌ థింకింగ్‌. మనం సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తాం. పరిష్కారం గురించి ఆలోచించం. ఎప్పుడైతే పరిష్కారం వైపు చూస్తామో… అప్పుడే ప్రయోజనం ఉంటుంది.

దంపతుల మధ్య గొడవలు మామూలే

నా భార్య పేరు శ్రీలక్ష్మి. ఆమె నాకు జీవితంలో లభించిన విలువైన బహుమానం. నన్ను అన్ని విధాల అర్థం చేసుకుంటుంది. అయినా భార్యాభర్తల మధ్య గొడవలు తప్పనిసరిగా ఉంటాయి. ఉండాలి కూడా.  ఒకరిమీద ఒకరికి మంచి అవగాహన, గౌరవం ఉన్నప్పుడు గొడవలు వెంటనే సమసిపోతాయి. ఒకరిమీద ఒకరికి కోపం వచ్చినప్పుడు… వాళ్లు చేసిన మంచి పనుల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంటే కోపం ఇట్టే తగ్గిపోతుంది. నా మనసు ఎరిగి శ్రీలక్ష్మి నడుచుకుంటుంది. మా ఇంట్లో స్నేహితులు, బంధువులు, పక్కింటోళ్ల ముచ్చట్లే ఉండవు. ఆర్థిక మందగమనం, పౌరసత్వ చట్టం… ఇలాంటి కరెంట్‌ అంశాలపైనే చర్చలు నడుస్తుంటాయి.

యువత సామాజిక మాధ్యమాల్లో ఉంది కానీ….

సమాజంలో భాగం కావడం లేదు. ఈ ఒంటరి తనం వల్ల అనేక రుగ్మతలు వస్తున్నాయి.

‌విద్యార్థి ఒక ప్రశ్నకు సమాధానం సొంతంగా తెలుసుకొనేలా ప్రోత్సహించాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాం. దాన్ని బట్టీ పట్టించి రాయిస్తున్నాం. ఇలా చేస్తే వాళ్లలో సృజనాత్మకత ఎలా వస్తుంది? కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుగుతుందో… బ్లాక్‌బోర్డు మీద చెబితే ఏం తెలుస్తుంది? విత్తనం నాటించి… మొక్క పెరగడం చూపించి చెబితే కదా విజ్ఞానం పెరిగేది.

నాకు ఇందులోనే సంతృప్తి

నాకు జర్నలిజమంటేనే ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఇది నిరంతరం నేర్చుకునే వృత్తి. మనం ప్రజల పక్షాన ఉంటే… వారే మనల్ని గెలిపిస్తారు. నేను అలా రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యా. రంగారెడ్డి జిల్లా పరిషత్‌ సమావేశం జరుగుతుంటే… రైతులు తమ పంట అమ్మగా రావాల్సిన నిధులు ఇవ్వలేదని ధర్నా చేస్తున్నారు. నేను సమావేశానికి వెళ్లి ఈ విషయంపై మాట్లాడా. వెంటనే రూ.3 కోట్లు విడుదలయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో గతంలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. నేను దీనిపై గళమెత్తి, రాజీనామా చేస్తానని ప్రకటించా. తర్వాత నాలుగు కళాశాలలు తెరిచారు. ఇలా… ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉంది.

యోగా చేస్తా

రోజూ ఉదయాన్నే యోగా, ధ్యానం సాధన చేస్తా. దీనివల్ల 16 గంటలు పనిచేసినా నేను అలసిపోను. ఉదయం 5.30గంటలకు లేస్తే… రాత్రి 12 గంటలైనా అంతే ఉత్సాహంతో పనిచేస్తా. దీనికి నాకున్న తీరని తపన కూడా ఒక కారణం. సమాజంలో నాకు ఓ పాత్ర ఉంది. విస్తృత బాధ్యత ఉందని గ్రహించాను. అందుకే నేను ఏ సమయంలోనైనా ఇంత ఎనర్జిటిక్‌గా ఉంటాను.

పిల్లలపై రుద్దకూడదు

ప్రముఖ చరిత్రకారుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మాకు కొడుకు పుట్టాడు. ఆయన గుర్తుగా రాహుల్‌ అని పేరుపెట్టా. అమర్త్యసేన్‌కు నోబుల్‌ బహుమతి వచ్చిన సంవత్సరంలో పుట్టిందని కూతురికి అమర్త్య అని నామకరణం చేశాను.  అబ్బాయి ఎంఎస్‌ చేసి.. అమెరికాలో ఉంటున్నాడు. కూతురు బిట్స్‌లో ఫార్మసీ చదువుతోంది. నేను ఎప్పుడూ వారిని ఇది చదవండి… అది చేయండి అని బలవంత పెట్టలేదు. పిల్లలపై మన ఆశలు రుద్దకూడదనేది నా అభిప్రాయం

Source eenadu news paper


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *