Spread the love

మహాకవి.. పద్మశ్రీ.. సరస్వతీపుత్ర డా|| పుట్టపర్తి నారాయణాచార్యులు ఒక మహానుభావుని గురించి మరియొక మహానుభావుడు వ్రాయడమనేది అరుదైన విషయం మరియు గొప్ప విషయం. మహామనిషి శ్రీ కొప్పరపు సుబ్బయ్య గారి గురించి గొప్ప పండితుడు, బహుబాషా ప్రవీణుడు (14 బాషలలో పాండిత్యం ఉన్నవాడు) శివతాండవ కావ్య రచయిత.. మహాకవి.. సరస్వతీపుత్ర.. పద్మశ్రీ… డా॥ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు వ్రాసిన వ్యాసంలోని కొన్ని విషయాలను ఇక్కడ మీకు అందించడమైనది.

శ్రీ కొప్పరపు సుబ్బయ్య శెట్టి గారు ఒక విశిష్ఠ వ్యక్తి, పూర్ణ మానవుడు. ఆయన ఇతర రాష్ట్రాలలో జన్మించి వుంటే తప్పకుండా జాతీయనాయకుడయ్యేవాడు. ఆయన మహా సాహసికుడు, ఆజానుబాహుడు. నుదురు ఎత్తుగా ఒకవైపు అదృష్టాన్ని చాటుతూ వుండేది. కన్నులలో రాజసము, లాలిత్యము పెనవేసుకొని ఉండేవి. ఆయన కంఠస్వరము మేఘ గర్జనము. ఆయన జీవితాంతం ఖద్దరు దుస్తులు మాత్రమే ధరించేవాడు. ఆ పెద్ద మనిషి వీధుల్లో ఠీవిగా నడిచివెళ్తుంటే మనుష్యత్వమే నడచి పోతున్నట్లు ఉండేది. భగవద్గీత అంటే ఆయనకు ప్రాణం. ప్రతి దినము గీతాపారాయణము చేయనిదే మంచినీళ్ళయిన ముట్టేవారు కాదు. ఆడంబరాలకు దూరంగా, సాత్వికాహారము, ఆశ్రమ జీవనం ఆయన జీవన శైలి. ఆయన బాల్య వివాహములకు వ్యతిరేకి. ఆ రోజుల్లో ఆయన అందరికి భిన్నంగా బాల్య వివాహములను వ్యతిరేకించి తన బిడ్డలకు బాల్యవిహాహములు చేయకుండా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి. స్వాతంత్రోద్యమము ప్రబలిన దినాలలో ఆయన నుండి సహాయము పొందని స్వాతంత్ర్య సమరవీరులు లేరు. కానీ ఆయన సాయం మాత్రం గోప్యంగా ఉండేది. ప్రొద్దుటూరులో హిందూ-ముస్లింలు ఈ రోజు ఐక్యభావముతో మరియు పరస్పర గౌరవ భావములతో జీవిస్తున్నారంటే దానికి పునాది శ్రీ కొప్పరపు సుబ్బయ్య గారే. ఆ రోజుల్లో బ్రిటీష్ వాళ్ళు పనిగట్టుకొని హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటే అటువంటి గడ్డురోజులలో ఎంతో ధైర్యంగా ముస్లిం పెద్దలందరిని సమావేశపరచి, ఐకమత్యం యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేసి హిందూ-ముస్లింల ఐక్యతకు కృషి చేశారు. ఆయనను మనస్ఫూర్తిగా అభిమానించే వారిలో వైశ్యులు, హిందువులే కాకుండా ముస్లిం సోదరులు కూడా ఎంతో మంది ఉండేవారు.

ఆ రోజుల్లోనే శ్రీ కొప్పరపు సుబ్బయ్య శెట్టి గారు కులమతాలకతీతంగా పేద విద్యార్థులకు ఫీజులు, పుస్తకములు, దుస్తులు సహాయం చేసేవారు. ఆయన ఇల్లు ఒక నిత్యాన్నదాన సత్రము లాగా ఎప్పుడూ సందడిగా ఉండేది. ఎంతో మంది ఆయన ఇంట్లో భోజనము చేసి వెళ్ళేవారు. వచ్చేవారు, పోయేవారితో ఆ ఇల్లు ఎప్పుడూ కిటకిటలాడు చుండేది. ప్రొద్దుటూరుకు విచ్చేసిన పండితులు గానీ, గాయకులు గానీ, ఏ రంగములోని ప్రముఖవ్యక్తి అయినా వారిని వట్టి చేతులలో పంపకూడదనేది కొప్పరపు సుబ్బయ్య గారి తత్వం. “ప్రొద్దుటూరుకు వచ్చిన మనిషి, పోట్లదుర్తికి వచ్చిన కుక్క వట్టి చేతులతో తిరిగిపోదు” అనే సామెత ఆయన కాలంలోనే ఏర్పడినదేమో అనిపిస్తుంది. అనేక బీద కుటుంబాలు ఆయనను ఆశ్రయించి బ్రతికేవి.

జన్మతో అయనకు అదృష్టం పట్టలేదు. కానీ స్వశక్తితో ఆయన ఎదిగాడు. మట్టిలోంచి తయారైన మనిషి శ్రీ కొప్పరపు సుబ్బయ్య గారు. ఆయనదొక సామాన్య నీలిమందు వ్యాపారము. అయనకు చేదోడుగా వసంతరావు అనే ఆయన దుకాణంలో ఉండేవాడు. ఆ వసంతరావునే ప్రొద్దుటూరు పురపాలక సంఘ అధ్యక్షునిగా చేసి కింగ్ మేకర్ అనిపించుకొన్నాడు. శ్రీ వసంతరావు గారి మరణానంతరం శ్రీ కొప్పరపు సుబ్బయ్య గారు మునిసిపల్ ఛైర్మెన్ అయ్యారు. అటు హిందువులకు, ఇటు ముస్లిం సోదరులకు ఆయన ఉపకారం ఎంతగానో ఉండేది. నిత్యం ఎప్పుడూ ప్రజాహిత కార్యక్రమాలలో ఆయన నిమగ్నమయ్యేవాడు. ఆయన ఇంట్లో రాత్రింబవళ్ళూ పంచాయితి తీర్పులకు మనుష్యులు కాచుకొని ఉండేవారు. ఎన్నో సమస్యలను ఆయన కోర్టులకు వెళ్ళనిచ్చేవాడు కాదు. తనే పరిష్కరించి పంపేవారు. ఆయన పరిష్కారం ధర్మబద్దంగా ఉండేదనేవారు. చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళకూ శెట్టిగారితో తమ తగువులు పరిష్కరించుకొనేందుకు వచ్చేవారు.

ప్రొద్దుటూరులో ఆయన ఎక్కిరాకముందు వైశ్యులలో ఎవరి దారి వారిదే. కల్లం లోని జొన్నలు అన్నట్లుండేది. ఆయన వారినందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చాడు. ఆయన కృషి ఫలితమే ఎన్నో రీతులలో ప్రతిభాసించినది. ఆయన కృషి ఫలితమే ఈ ఆర్యవైశ్య సభ. ఆయన దార్శనికుడు.. ఎంతో దూరదృష్టి గలవాడు. ఆర్యవైశ్య సభకు నియమ నిబంధనలు ఏర్పాటు చేయడంలో ఆయన కృషి ఎనలేనిది. ఆయన ఆర్యవైశ్య సభకు సుమారుగా 28 సంవత్సరముల పాటు అధ్యక్షునిగా పనిచేయడము జరిగినది. పదవుల కోసం ఆయన ప్రాకులాడలేదు. పదవులే ఆయన వెంట వచ్చేవి. శ్రీ కొప్పరపు సుబ్బయ్య గారి నాయకత్వంలో ఆయన చెప్పింది.. వేదవాక్యం…

ఆయన 1945 సంవత్సరములో మద్రాసు పట్టణములో చికిత్స పొందుతూ భగవదైక్యం పొందారు. ఆయన భౌతికకాయము ప్రొద్దుటూరుకు తీసుకు రాబడి యావత్ ప్రొద్దుటూరు ప్రజానీకం శ్రద్ధాంజలి ఘటించడము జరిగినది. ఆయన జ్ఞాపకార్థముగా శ్రీ కొప్పరపు సుబ్బయ్య మెమోరియల్ హాల్ నిర్మించబడినది. తదనంతర కాలములో ఆయన స్మృతి చిహ్నాంగా శివాలయం వీధిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఆయనలా ప్రజాభిమానము చూరగొన్న వ్యక్తి
కడప జిల్లాలో మరొకరు లేరని చెప్పవచ్చు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *