ఆర్య మహాదేవి యొక్క తేజో కిరణమే శ్రీ వాసవీ కన్యక. అనసూయ మాత “అగ్నియోగం ” వల్ల జన్మించిన కవలపిల్లలే శ్రీపాద శ్రీ వల్లభులు మరియు శ్రీ వాసవీ కన్యక. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మాత శ్రీపాద శ్రీ వల్లభుల సహొదరి. ఆమె ముఖ వర్చస్సు సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభుల వారిని పోలిఉండును . శ్రావణ శుద్ధ పౌర్ణమి (రాఖీ పౌర్ణమి) రోజు శ్రీపాద శ్రీ వల్లభులు ఎక్కడున్నా బృహత్సిలానగరం దీనికే జ్యేష్టశైలం అనికుడా పేరు (పెనుగొండ) నకు వచ్చెదరు . ఆ రోజు వాసవీ కన్యకాంబ శ్రీపాద శ్రీ వల్లభుల వారికి రక్షా బంధనం కట్టుపుణ్య దినము. ఆరోజు ఎవరైతే పిఠాపురం నందు శ్రీ పాదుల వారి సన్నిధానం లో ఉంటారో వారికి చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. శ్రీ వాసవీ కన్యకాంబ నామస్మరణ ఎక్కడ చేయబడుచుండునో అక్కడ గుప్త రూపం లో శ్రీపాద శ్రీ వల్లభులు నివసించును. శ్రీపాద భక్త భందువులందరూ( వైస్యులైన లేదా కాకున్నా ) తప్పనిసరిగా పిఠాపురం నకు 90 కి .మీ. దూరంలో ఉన్నపశ్చిమ గోదావరి జిల్లలో గల పెనుగొండ లో వేంచేసి ఉన్న శ్రీ నగరేశ్వర మహిషాసురమర్ధిని – శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ని దర్శించుకుంటే మంచిది.
భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరించింది. అలాంటి వాటిలో ‘శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి’ రూపానికి ఎంతో విశిష్టత వుంది. ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ‘పెనుగొండ’లో విలసిల్లుతోంది.
ఇది వాసవీమాత క్షేత్రంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, అంతకు పూర్వం నుంచే ఇక్కడ ‘నగరేశ్వరుడు’ పేరుతో శివుడు పూజలందుకుంటున్నాడు. ఈ స్వామి ఇక్కడ వేల సంవత్సరాలు క్రితమే ఆవిర్భవించాడనడానికి ఆధారాలు వున్నాయి. ఎందరో రాజ వంశీకులు ఈ స్వామి అనుగ్రహంతో విజయాలు సాధించారు. మరెందరో మహాభక్తులు స్వామివారిని సేవించి తరించారు. ఇక ఈ స్వామికి ఎదురుగా ‘రెండు నందులు’ కొలువుదీరి వుండటం విశేషంగా చెప్పుకుంటారు.
కాలక్రమంలో ఆలయాన్ని పునఃనిర్మిస్తూ మహిషాసుర మర్ధిని అమ్మవారినీ … వాసవీ కన్యకా పరమేశ్వరిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక అమ్మవారి ఆవిర్భవానికి సంబంధించిన విషయంలోకి వెళితే, ‘పెనుగొండ’ ప్రజల కోసం అమ్మవారు తన భక్తులైన దంపతులకు జన్మించింది. యుక్తవయసులోకి అడుగుపెట్టిన వాసవిని, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తోన్న రాజు వివాహం విషయంలో ఇబ్బంది పెట్టాడు. దాంతో ఆమె మానవ రూపాన్ని చాలించి శక్తి స్వరూపిణిగా అవతరించింది. అప్పటి నుంచి భక్తులు ఆమెను అనేక విధాలుగా ఆరాధిస్తూ వస్తున్నారు.
లక్ష్మీ జనార్ధనస్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.