Display Image Kapil Kapil Business Park
gothramgothram
Spread the love

గోత్రము

     గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.

     ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ….. ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు…

     సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే !

విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.

   ప్రవర

     కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.

  ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,

|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు

———————- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ /  పంచార్షేయ /  సప్తార్షేయ ప్రవరాన్విత

—- సగోత్రః , —– సూత్రః, —– శాఖాధ్యాయీ

…………………….శర్మన్ అహం భో అభివాదయే ||

అని పలకాలి

ప్రవర చెప్పునపుడు , లేచి నిలబడి , చెవులు చేతులతో ముట్టుకుని ఉండి , ( కుడి చేత్తో ఎడమ చెవి , ఎడమ చేత్తో కుడి చెవి …..కొందరు ఇంకోరకంగా ముట్టుకుంటారు ) , ప్రవర చెప్పి , వంగి భూమిని చేతులతో  ముట్టి  సాష్టాంగ నమస్కారము చేయవలెను .

   పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ….ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ … ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.

సూత్రము

ప్రవరలో మన సూత్రమేదో కూడా చెపుతాముకదా ..సూత్రమంటే ఏమిటి ?

యజ్ఞ యాగాదులు అనేక రకమైనవి ఉన్నాయి . ఉదాహరణకు , ’ దర్శ పూర్ణ మాస యాగము , అశ్వమేధ , పురుష మేధ మొ|| నవి .  ఆయా యాగాదులలో ఇవ్వవలసిన ఆహుతులు ఏమిటి అన్న విషయాలు తెలిసిఉండవలెను .  యజ్ఞ యాగాదులు మాత్రమే కాక , మనము చేయు శుభకార్యములన్నీ కూడా ఒక పద్దతిలో , సాంప్రదాయాన్ని అనుసరించి చేస్తాము .

ఈ పద్దతులను , సాంప్రదాయాలనూ వివరించేవే సూత్రాలు . ఈ సూత్రాలను వివిధ మహర్షులు రాసియున్నారు . యజుర్వేదము పాటించేవారికి ’ ఆపస్తంబుడు ’  ’ బోధాయనుడు ’ సూత్రాలను రాసియున్నారు . ఋగ్వేదీయులకి ’ ఆశ్వలాయనుడు ’ రాశాడు .

బోధాయన సూత్రాలు చాలా వివరాలతో , ఎంతో నిడివితో కూడుకొని ఉంటాయి . బోధాయనుడి శిష్యుడైన ఆపస్తంబుడు , ఆ కాలానికే అవి నిడివి ఎక్కువ అని గ్రహించి , అనవసరమైన వాటిని కుదించి , ఎంత అవసరమో వాటిని మాత్రమే తిరగ రాశాడు . ఈనాడు యజుర్వేదము అనుసరించేవారిలో అధిక శాతము ఆపస్తంబుడి సూత్రాలనే ఎక్కువగా అనుసరిస్తారు . అయితే బోధాయన సూత్రాలను పాటించేవారుకూడా అనేకులున్నారు .

ఆపస్తంబుడు శ్రౌత , గృహ్య , ధర్మ  మరియు శుల్బ సూత్రాలను రాశాడు . వీటన్నిటినీ కలిపి ” కల్ప సూత్రాలు ” అంటారు . మన వంశీయులు సాంప్రదాయకంగా పాటించే సూత్రాలను రాసినవారి పేరు కూడా ప్రవరలో చెప్పడము ఆనవాయితీ అయింది . ప్రవర అనేది ఒకమంత్రము కాదు . అది కేవలము మన పరిచయాన్ని చెప్పడము మాత్రమే .

 (   ఆపస్తంబుడి ,  2650  B.C  గురించి ఒక చిన్న  ఆసక్తి కరమైన   విశేషము ..ఆపస్తంబుడు అనునది అతని నిజమైన పేరుకాదు . అతడు ’ జల స్తంభన ’ విద్య నేర్చుకొని , నీటి అడుగున పద్మాసనములో రోజుల తరబడి కూర్చొని ధ్యానము చేసేవాడు. నీటిని నియంత్రించేవాడు కనక అతడిని ’ ఆపస్తంబుడు ’ అన్నారు . ( కొందరు ’ ఆపస్తంభుడు ’ అంటారు )  అతడు నీటిలో ఉండగా , చేపలు ఆకర్షించబడి అతని దగ్గర గుంపులు గుంపులుగా తిరుగుతుండేవి . జాలరులు అతడున్నది తెలియకనే , అక్కడికి వచ్చి చేపలు పట్టేవారు . ఒకసారి ఆపస్తంబుడు వలలో చిక్కుకొనగా , అతడిని జాలరులు  ” నాభాగుడు ’ అను  రాజుగారి వద్దకు తీసుకొని పోతారు . రాజు అతడిని గౌరవించి , గోవులు సమర్పించి వదిలివేస్తాడు .  )

వివాహ నిబంధనలు

గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు….చేసుకోకూడదు… ఎందుకంటే , ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటి  వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తండ్రీ కూతుళ్ళో , తల్లీ కొడుకుల వరస కలవారో అవుతారు..

సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,

ఏ రెండు కుటుంబాలకు గానీ ” ప్రవర ” పూర్తిగా కలిసినచో  వారు సగోత్రీకులు అవుతారు.

   బౌధాయనుల ప్రకారమైతే , సమాన గోత్రము లేక ‘ సగోత్రము ‘ అని నిర్ణయించడానికి కింది కొలమానము ఉపయోగించాలి.

మొదట , ఇద్దరి గోత్రమూ ఒకటే కావాలి. తర్వాత ,

* ఎవరికైతే   ప్రవరలో ఒకడే ఋషి ఉంటాడో , అదే ఋషి ప్రవరలో గల కన్య తో వివాహము తగదు.

* ఎవరికైతే   ప్రవరలో ముగ్గురు ఋషులు ఉంటారో , ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

* ఎవరికైతే   ప్రవరలో ఐదుగురు ఋషులు ఉంటారో , ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

* ఎవరికైతే  ప్రవరలో  ఏడుగురు ఋషులు ఉంటారో , ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.

ఇదీ , సగోత్రము అవునా కాదా అని నిర్ణయించే పద్దతి. అంతటితో అయిపోలేదు… అవి కాక, ఇంకొన్ని కూడా చూడాలి..

మాతృ గోత్రాన్ని వర్జించాలి. అంటే , తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి , ఆ ప్రకారముగా సగోత్రమైతే  అప్పుడు కూడా వివాహమాడరాదు.

ఏయే గోత్రాలకు యే యే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది… ఇక్కడ రాయడము వీలు పడదు.

ఇక నిబంధనల సడలింపులు

ఈ విషయములో సడలింపులు అంటూ ఏవీ లేవు.

గోత్రము తెలియనిచో , తనని తాను ఎవరికో ఒకరికి ( దత్తత )  ఇచ్చుకొని , వారి గోత్ర ప్రవరుడు కావాలి. తెలిసినచో , ఈ పద్దతి తగదు.

తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహము జరిగి సంసారం చేస్తే , ప్రాయశ్చిత్తం చేసుకొని , ఆ కన్యని తల్లిలా ఆదరించాలి.

తెలిసి చేస్తే , గురు తల్ప వ్రతం చేసి , శుధ్ధుడై , ఆ భార్యని తల్లి లా ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు.

తెలియక చేస్తే , మూడు చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి.( చాంద్రాయణం అనగా , ఒక నెలలోని శుక్ల పక్షం లో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి. రెండో రోజు రెండు ముద్దలు , మూడో రోజు మూడు, ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి. తర్వాత, కృష్ణ పక్షం లో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి. అమావాశ్య కు పూర్తి ఉపవాసం ఉండాలి… ఇలా ఒక నెల చెస్తే అది ఒక చాంద్రాయణం. ) ఈ ప్రాయశ్చిత్తం తాను శుధ్ధుడవటానికి మాత్రమే… ఇది ఒక వెసులుబాటు కాదు. ……..


Spread the love

By admin

10 thoughts on “గోత్రము , ప్రవర , వివాహ నిబంధనలు”
  1. Woolekeswara గోత్రాలు యొక్క ప్రవర తెలియ పరచగలరు

  2. Our surname “Chilamakuru” is not in the list. Please add.
    Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *